తిరువనంతపురంలో 'అనంత సంపద' వెలికితీతతో
రాష్ట్రంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ముమ్మరంఅహో నిధుల బిలం!
నల్లమలలో వెలసిన నారసింహుడు
బిలంలో భారీ సంపద ఉందని ప్రచారం
భద్రతపై నిర్లక్ష్యం.. గుత్తి కోటపై వేటగాళ్ల పాగా
శతాబ్దాల నాటి కట్టడాలు ధ్వంసం
పెనుకొండలో తవ్వకాలు.. కనుమరుగవుతున్న రాయల
కాలం నాటి కట్టడాలు
శ్రీకూర్మం గర్భాలయం రెండు వైపులా నేల మాళిగలు!
కడపలోనూ దురాగతాలు.. నిద్రలో పురావస్తు శాఖ
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. కోటలు కాలగర్భంలో కలుస్తున్నాయి. వారు నిర్మించిన ఆలయాలు శిథిలమయ్యాయి. కానీ, గుప్త నిధుల కోసం 'వేట' మాత్రం కొనసాగుతూనే ఉంది. మహమ్మదీ య, బ్రిటిష్ పాలనల్లో.. దండయాత్రల సమయంలో వజ్ర వైఢూర్యాలు, మణిమరకతాలు, స్వర్ణాభరణాలు, నాణేలు తదితర సంపదను కోటల్లో, ఆలయాల్లో, గుహల్లో, సరస్సుల కింద దాచి ఉంటారన్న విశ్వాసం ఈ వేటకు పురిగొల్పుతోంది.
కొన్నిచోట్ల అంతోఇంతో నిధులు దొరకడం దుం డగుల ఆశకు బలాన్నిస్తోంది. కోటలను తవ్వేస్తున్నా ఆలయాలను శిథి లం చేస్తున్నా పురావస్తు శాఖ నిద్రావస్థ ఏమాత్రం వీడకపోవడం వారికి మరింత ఊతమిస్తోంది. తాజాగా, తిరువనంతపురంలోని శ్రీఅనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగలలో రూ.లక్షల కోట్ల సంపద బయట పడటం గుప్తనిధుల వేటగాళ్లకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తవ్వకాలు జోరందుకున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని అహోబిల క్షేత్రంలోని బిలం 'అనంత' సంపదకు నిలయమనే ప్రచారం ఎన్నాళ్లుగానో ఉంది.
ఇక్కడ ఎగువ, దిగువ అహోబిలాల పేరిట రెండు క్షేత్రాలున్నాయి. ఎగువన ఆలయ ఆవరణ లో, స్వామివారి అంతరాలయానికి సమీపాన పెద్ద బండకింద భారీ బి లం ఉందని భక్తుల నమ్మకం. ఇందులోనే భారీగా నిధి నిక్షేపాలున్నట్లు అర్చకులు, స్థానికులు విశ్వసిస్తున్నారు. రామానుజుడి కాలంకన్నా ముం దే అహోబిల క్షేత్రం పీఠాధిపతుల అధీనంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు, గద్వాల మహారాణి వంటి వారు అందజేసిన బంగారు, వజ్ర వైఢూర్యాలు పోగు పడిన ట్లు తెలుస్తోంది. ఈ సంపదను కాపాడుకునేందుకు నాటి పీఠాధిపతులు ఎంతగానో శ్రమించారు.
బహమనీ సుల్తానులు దండయాత్ర సమయం లో నాలుగో పీఠాధిపతి ఆలయ ప్రాంగణంలోనే పెద్ద బిలాన్ని తవ్వించి సంపదనంతా దాచారంటారు. అంతేకాకుండా ఆ సంపద కోసం సుల్తానులు తనను హింసిస్తారని భావించిన ఆయన, నిధితోపాటు సజీవ సమాధి అయ్యారన్న కథనం ప్రచారంలో ఉంది. ఈ బిలంపై గుండ్రటి బండ కనిపిస్తుంటుంది. పవిత్రమైనదిగా భావించే ఈ ప్రదేశంపై భక్తులు కాలు పెట్టకుండా చుట్టూ ఇనుప చట్రాన్ని కూడా అమర్చారు. ఆలయంలోని స్తంభాలపై ఒక మహిళ కుండ నుంచి నిధిని బయటకు తీసే చిత్రం కనిపిస్తుంది. ఈ ఆలయంలో భారీగా నిధులున్నాయనేందుకు ఇది కూడా నిదర్శనమని భావిస్తున్నారు.
ఈ నిధులను వెలికి తీసేందుకు 1986లో కర్ణాటకలోని కోలార్ గనుల్లో పనిచేసే పురాతత్వ శాస్త్రవేత్త నాగరాజు ప్రభుత్వ అనుమతి పొందారు. అయితే, ఇందు కోసం ఆయన బళ్లారి నుంచి అహోబిలానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం లో ఆయన మరణించారని సమాచారం. దీనికిముందే సుమారు 50 ఏళ్ల కిందట కొందరు దొంగలు గుప్త నిధులను కొల్లగొట్టేందుకు యత్నించి విఫలమైనట్టు స్థానికులు చెబుతున్నారు. దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ఎగువ అహోబిల ఆలయానికి ఇప్పుడు భద్రత కరువైంది. తిరువనంతపురం ఉదంతం నేపథ్యంలో అధికారులు ఇద్దరు హోంగార్డులను ని యమించినా భద్రతపై భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శిథిలమవుతున్న గుత్తికోట
ప్రాచీన చరిత్రకు, కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన శతాబ్దాల చరిత్ర కలిగిన గుత్తికోట గుప్త నిధుల వేటగాళ్ల చేతిలో శిథిలమవుతోంది. క్రీ.పూ. 213లో ఆంధ్ర చక్రవర్తులు నిర్మించినట్లు చెబుతున్న ఈ దుర్గంలో వారి నుంచి మొదలుకుని విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు, టిప్పు సుల్తాన్ వరకూ పాలన సాగించారు. దీంతో, ఇక్కడ పెద్దఎత్తున నిధులు ఉంటాయన్న ప్రచారం ఉంది.
2010 మార్చి 4న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నగరానికి చెందిన కొందరు గుప్తనిధుల వేటగాళ్లు కోటలోని మూడో ముఖ ద్వారాన్ని ధ్వంసం చేయగా కోటలోని సత్తెమ్మ గుడి ముందు సుమారు 500 వరకు బంగారు నాణేలు లభ్యమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒక్కో నాణెం బరువు 40 గ్రాముల దాకా ఉన్నట్లు సమాచారం. కాలగర్భంలో కలిసి పోయిన, యుద్ధ సమయంలో రాజులు వినియోగించిన మూడు ఫిరంగులు కూడా వేటగాళ్ల తవ్వకాల్లో బయటపడ్డాయి. నేటికీ అవి గుత్తి దుర్గంలో పర్యాటకులకు దర్శనమిస్తూనే ఉన్నాయి.
అలాగే, సత్తెమ్మ గుడి వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులకు పది నాణేలు దొరికాయని చెబుతారు. అయితే, నిధులు దొరికిన వారు వాటిని అక్కడ జారవిడుచుకుని వెళ్లినట్లు సమాచారం. ఈ రెండు ఘటనల కారణంగా, కట్టడాల్లో సంపదలు ఉన్నాయన్న ఆశతో దుండగులు కోట గోడలను కూడా కూల్చేస్తున్నారు. అయినా, దుర్గాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు.
రాయల కోటల్లో 'గుప్త' వేటలు
శ్రీకృష్ణదేవరాయలనాటి పట్టణంగా పెనుకొండకు పేరుంది. కొంత కాలంపాటు ఇది విజయనగర సామ్రాజ్యానికి ముఖ్య పట్టణంగానూ ఉంది. క్రీస్తు పూర్వం మౌర్యుల నుంచి తెల్లవాళ్ల వరకూ కొండను ఏలిన పాలకులెందరో! దీంతో ఇక్కడ భారీగా సంపద పోగుపడి ఉంటుందన్నది వేటగాళ్ల విశ్వాసం. ఫలితంగా రాయల కాలంనాటి అనేక బురుజులు, కట్టడాలు, ఆలయాలు తవ్వకాలతో శిథిలమవుతున్నాయి. ఇప్పటికే కొం డపైన ఉన్న నరసింహస్వామి ఆలయం, ఖిల్లా, విశ్రాంతి భవనం, తిమ్మరుసు బందిఖానా, కొండలు శిథిలావస్థకు చేరాయి. పదిహేనేళ్లుగా ఇక్క డ తవ్వకాలు సాగుతున్నాయి.
ఏడాది కిందట కడప జిల్లా వేటగాళ్లు వ్యా సరాయల బృందావనం సమీపంలోని కొండ వద్ద తవ్వకాలు జరిపారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరపగా పరికరాలను వదిలి తప్పించుకున్నారు. ఇటీవల వారం రోజుల కిందటే తిమ్మరసు సమాధి తవ్వకాలు జరిపి పైకప్పును ధ్వంసం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధి ఒకరు, అతని సమీప బంధువులు లక్షలాది రూపాయలు వెచ్చించి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. వీరికితోడు, కడప, చిత్తూరు, కర్నూలు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన అనేకమంది వేట సాగించారు. అయితే, ఇంతవరకూ ఎటువంటి నిధులు, వజ్రాలు, బంగారం లభించినట్లు లేదు.
ఇక, రత్నగిరి కొండలోనూ దాదాపు ఇదే పరిస్థితి. బ్రిటిష్ పాలకుల కన్ను రత్నగిరిపై పడినప్పుడు అప్పటి రాజులు తమ సంపదను ఇక్కడి సరస్సులో పడేసినట్లు స్థానికులు చెబుతుంటారు. దీనిని ఆధారం చేసుకుని కొన్నేళ్లుగా రత్నగిరి కోట గోడలు, రాతి ఏనుగుల కింద, కిష్టప్ప రాజు సచివాలయంలో, ఈశ్వర దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, అరిసణ బావితోపాటు మరికొన్నిచోట్ల తవ్వకాలు జరిపారు. కొల్లాపురి మహాలక్ష్మీ దేవాలయం సమీపంలోని కల్యాణి బావిలోని విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని పెకలించి వదిలేశారు.
రాయదుర్గంపై వేటగాళ్లు
రాయదుర్గం పేరు వినగానే రాయల కాలం గుర్తుకొస్తుంది. ఇక్కడి కొండపై రాజులు నిర్మించిన దేవాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల వేటను ఇష్టారాజ్యంగా సాగిస్తుండడంతో చారిత్రక ఆధారాలు ధ్వంసమవుతున్నాయి. గట్టి మల్లప్ప కొండలో ఉన్న ఐదడుగుల నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మాధవ రాయస్వామి దేవాలయంలో మూలవిరాట్ను, ఆలయం ముందున్న శిలా శాసనాన్ని ధ్వంసం చేశారు. లింగాల బండలో పశుపతి నాథుని విగ్రహాన్ని పక్కకు జరిపి మూడుసార్లు గుప్త నిధుల తవ్వకాల కోసం ప్రయత్నించారు.
అంతేనా.. పూజారులను బంధించి దేవీ విగ్రహాన్ని ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. శంభులింగ కొండలో మూలవిరాట్ను మూడుసార్లు జరిపి తవ్వకాలు జరిపినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో త వ్వకాలు చేస్తున్నారు. అయితే, గట్టి మల్లప్ప కొండ కింద ఉన్న దేవాలయంలో పశువుల కాపరికి 1984లో 300 బంగారు నాణేలు లభ్యమయ్యాయి. వాటిలో 160 నాణేలను అధికారులు స్వాధీనం చేసుకుని ట్రెజరీలో భద్రపరిచారు. వెప్రకల్లు నరసింహ స్వామి దేవాలయం వద్ద ఉన్న పొలంలో నిధి లభ్యమైనట్లు ఆధారాలున్నాయి.
కడపలో దుండగుల దురాగతాలు
కోటలు, చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల్లో వజ్ర వైఢూర్యాలు, బంగారు నగలను దాచి ఉంటారన్న భావనతో కడప జిల్లాలో దుండగులు స్వైర విహారం చేస్తున్నారు. తవ్వకాలు జరిపి నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. చోళరాజులు, మట్లిరాజులు, విజయనగర రాజులు నిర్మించిన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలోనూ, రామతీర్థం కొలను మంటపం వద్ద గుప్త నిధుల కోసం దుండగులు నిర్మాణాలను పగలగొట్టారు. నాలుగేళ్ల కిందట కోదండ రామాలయంలో ఆలయ రాతి మొగ్గను పగలగొట్టారు. ఇదే మండలంలోని గుంటికాడపల్లె మల్లేశ్వరస్వామి ఆలయంలో శివలింగాన్ని పెకలించారు.
అంతకు ముందు కుడమలూరు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అక్కడి నుంచి రెండు కేజీల బంగారం తీసుకెళ్లారని అనుమానిస్తున్నారు. మంటపంపల్లెలో శివపార్వతుల విగ్రహాలను దుండగులు తీసుకెళ్లారు. వీటిలో ఒక విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనగలూరు మండలం నాగేశ్వర క్షేత్రంలో వరదరాజస్వామి ఆలయంలోనే తవ్వకాలు జరిపారు. జమ్మల మడుగు సమీపంలోని గండికోటలో కూడా అనేకమార్లు తవ్వకాలు జరిపారు.
ఈ కోటలో గత నెలలో కూడా నిధుల కోసం తవ్వకాలు జరిపితే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారు నాణేలు ఉంటాయేమోనని జుమ్మా మసీదు మినార్లను ధ్వంసం చేశారు. తాజాగా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలో చెన్నకేశవస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి రాతి మొగ్గను పగలగొట్టి తీసుకెళ్లారు. చారిత్రక ఆధారాలను కాపాడాల్సిన పురావస్తు శాఖ నిద్రావస్థలో జోగుతోంది. పురాతన కట్టడాలను కాపాడడంలో విఫలమవుతోంది.
శ్రీకూర్మంలో గుప్త నిధులు?
అనంత పద్మనాభుని అంతులేని సంపద బయటపడడంతో ప్రాచీన దేవాలయాల్లో గుప్త నిధులపై చర్చ మొదలైంది. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో 8వ శ తాబ్దంలో నిర్మించిన శ్రీకూర్మనాథాలయంలో కూడా గుప్త నిధులు ఉండి ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది. మహాలక్ష్మి దయ వల్ల ఐశ్వర్యానికి ప్రతీకలైన నిధులు కుబేరుని వద్ద ఉన్నాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. పద్మం, మహా పద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం అనే నవ నిధులకు శంఖనిధి, పద్మనిధి అనే గొప్ప నిధులను శ్రీకూర్మంలో నిక్షిప్తం చేశారని పండితులు చెబుతున్నారు.
మహ్మదీయుల దండయాత్రల వల్ల దక్షిణ హిందూదేశంలో దేవాలయాలకు రహస్య భూగృహాలు ఉండేవని, మహ్మదీయుల దండయాత్ర సమయంలో ఇక్కడా నిధులను దాచారని చరిత్రకారుల అభిప్రాయం. శాసనాల ద్వారా ఆలయ సంపద వివరాలు తెలుస్తున్నాయని ఆదిభట్ల వెంకటరమణ 'శ్రీకాకుళం జిల్లా చరిత్ర' పుస్తకంలో పేర్కొన్నారు. గర్భాలయానికి ఇరువైపులా 21 అడుగుల లోతులో రెండు నేలమాళిగలున్నాయని, వాటిపై బలరామకృష్ణుల విగ్రహలున్నాయని, ఆ నేలమాళిగల్లో అపార నిధి ఉందని తాజా వాదనలకు తెరలేచింది.
భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం
ఎంతో చరిత్ర కలిగిన అహోబిల ఆలయ భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. పీఠాధిపతులు, ఆలయ నిర్వాహకులు అవినీతిలో మునిగిపోయారు. కనీసం పదిమంది సాయుధ పోలీసులను అహోబిలంలో ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
- నీలకంఠం, న్యాయవాది, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి
రాయల ఆధారాలున్నాయి..
1993 -94లో నేను అహోబిల ఆలయంపై పరిశోధన జరిపాను. నా పరిశోధనలో శ్రీకృష్ణ దేవరాయల కాలంనాటి 38 శాసనాలు దొరికాయి. వాటిలో అధిక భాగం దాన ధర్మాలకు సంబంధించినవే.
- రాంగోపాల్, పరిశోధకుడు, ఎస్వీ యూనివర్సిటీ
ఆలయ ప్రాశస్త్యం తగ్గిపోతుంది..
ఆలయంలో పురాతన నిధులుంటే ఉండనీయం డి. ప్రభుత్వం వీటిని వెలికి తీయడం వల్ల ఇప్పటి దాకా ఉన్న భక్తిభావం తగ్గిపోతుందనే ఆందోళన కలుగుతోంది.
- కృష్ణకుమార్, ఐఐటీ ప్రొఫెసర్, బెంగళూరు




RSS Feed